: సుజనా ఇంటి ముందు చంద్రబాబు చెప్పినట్టే చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
కృష్ణా జిల్లా నందిగామ మండలంలోని పొన్నవరంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇంటి ముందు కాంగ్రెస్ పార్టీ వినూత్న తరహాలో నిరసన తెలిపింది. యువజన కాంగ్రెస్ నేత దేవినేని అవినాష్ నేతృత్వంలోని కార్యకర్తలు సుజనా ఇంటి ముందు చీపుర్లతో రోడ్లు ఊడ్చి ప్రత్యేక హోదా కోసం సుజనా చౌదరి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. రోడ్డుపై ఉన్న చెత్తను ఎత్తిపోశారు. ఆపై అవినాష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినట్టే తాము జపాన్ తరహాలో నిరసనలను వ్యక్తం చేశామని చెప్పారు. రాష్ట్రానికి హోదాను సాధించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. పెద్దఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పొన్నవరం గ్రామానికి తరలిరాగా, స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామంలో కొంత ఉద్రిక్తత నెలకొంది.