: కేంద్రాన్ని నిలదీయలేని జగన్, నన్ను వ్యక్తిగతంగా కార్నర్ చేస్తున్నాడు: సీఎం చంద్రబాబు
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రాన్ని నిలదీయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తనను వ్యక్తిగతంగా కార్నర్ చేస్తున్నాడని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ‘నేను కేంద్రమంటే భయపడుతున్నట్లు జగన్ చెబుతున్నారు. నాకు భయమేంటి? నేనెందుకు భయపడతా? ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టే నాపై ఇష్టమొచ్చినట్లు ప్రకటనలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీని ఇబ్బందుల్లో పెట్టాలని కాంగ్రెస్ పార్టీ, జగన్ ఇప్పుడూ యత్నిస్తున్నారు. మరోసారి మోసానికి కాంగ్రెస్, వైఎస్సార్సీపీ లు యత్నిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్లు చేసిన అన్యాయాన్ని ఈ రాష్ట్రంలో ఎవరూ కూడా జీవితంలో మరిచిపోలేరు. ప్రజలను మోసం చేయాలనుకుంటే వాళ్లే మోసపోతారు. నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు, నేను ఏ తప్పు చేయలేదు, చేయను కూడా. ఈరోజు అరుణ్ జైట్లీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. విభజన చట్టంతో పొందుపరిచిన అంశాలు, ఎన్నికలప్పుడు చెప్పిన విధంగా కేంద్రం సహకరించాలి. త్వరలోనే పరిష్కారం చేస్తామని జైట్లీ నాతో చెప్పారు. ప్రజల్లో ఆందోళన ఉన్న విషయాన్ని నేను జైట్లీ దృష్టికి తీసుకువెళ్లాను. కేంద్రం నన్ను సంతృప్తి పరచాల్సిన అవసరం లేదు. ప్రజలను సంతృప్తి పరిస్తే చాలు. దగాపడ్డ తెలుగుజాతికి హామీ ఇచ్చారు. వాటినే నెరవేర్చాలని బీజేపీని కోరుతున్నాను, పోలవరం కుడికాలువకు గండి ఎలా పడిందో కూడా విచారణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గండి పడిందో లేక గండి పెట్టారో తెలుసుకోవాలి. ఈ నెల 4న ఢిల్లీ వెళ్తున్నాను. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు సీజే, ఇతర ప్రముఖులను కలిసి పుష్కరాలకు ఆహ్వానిస్తాను’ అని చంద్రబాబు పేర్కొన్నారు.