: అమలాపాల్ విడాకులు నిజమే!: ఆమె మామ
సినీ నటి అమలాపాల్ విడాకులపై వస్తున్న వార్తలన్నీ వాస్తవమేనని ఆమె మామ, సినీ నిర్మాత అళగప్పన్ తెలిపారు. అమలాపాల్, ఆమె భర్త ఎ.ఎల్.విజయ్ మధ్య విభేదాలు వాస్తవమేనని ఆయన చెప్పారు. విభేదాల కారణంగా వారు విడిపోయారని, ఇక చట్టపరంగా విడాకులు తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. వివాహానంతరం అమలాపాల్ నటించడం తమ ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదని ఆయన చెప్పారు. ఆమె కూడా అందుకు అంగీకరించినట్టే కనిపించిందని, అయితే వివాహం తరువాత కూడా ఆమె సినిమాలు అంగీకరించిందని, ఇది ఆమె భర్తకు నచ్చలేదని ఆయన తెలిపారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపాయని ఆయన వెల్లడించారు. ఆ తరువాత వారిద్దరూ మాట్లాడుకున్న సందర్భంగా ఇకపై సినిమాలు అంగీకరించనని చెప్పిందని ఆయన పేర్కొన్నారు. ఆ మాటకు తిలోదకాలిచ్చి పాటలు పాడుతోందని ఆయన ఆరోపించారు. అంతటితో ఆగకుండా సూర్య, ధనుష్ సినిమాల్లో కూడా నటిస్తోందని ఆయన మండిపడ్డారు. కుటుంబం మాట పట్టించుకోకుండా ఆమె సినిమాలు చేయడం తమకు ఇష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆమెతో తన కుమారుడు ఏం మాట్లాడాడో తెలియదని, అయితే తమ కొడుకు తమకు ముఖ్యమని ఆయన చెప్పారు. వారిద్దరూ విడిపోవడం నిజమేనని, చట్టంపరంగా విడిపోవాల్సి ఉందని ఆయన తెలిపారు. దీంతో ప్రేమ వివాహం చేసుకున్న అమలాపాల్ వ్యక్తిగత జీవితం ఇలా అయిపోయిందేమిటా? అని ఆమె అభిమానులు బాధపడుతున్నారు.