: టీ ఎంసెట్- 2 హాల్ టికెట్ తోనే ఎంసెట్- 3 పరీక్ష!... విద్యార్థులకు ఉచిత బస్సు సదుపాయం!
పేపర్ లీక్ అయ్యిందన్న ఆరోపణలతో ఎంసెట్-2 పరీక్షను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం సాయంత్రంలోగా ఎంసెట్-3 కి సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించనుంది. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలతో సాయంత్రంలోగా ఎంసెట్-3 షెడ్యూల్ విడుదలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్యా, వైద్య శాఖ మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి, జేఎన్టీయూ అధికారులతో భేటీ అయిన కేసీఆర్... ఎంసెట్-2 రద్దుకే నిర్ణయం తీసుకున్నారు. ఎంసెట్-2 పేపర్ లీక్ అయిన కారణంగానే ఎంసెట్-3కి నిర్ణయం తీసుకున్నామని ప్రకటించిన కేసీఆర్... విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ఎంసెట్-3 కోసం ఎంసెట్-2 అభ్యర్థులు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని చెప్పిన కేసీఆర్... ఎంసెట్-2 హాల్ టికెట్లతోనే వారు ఎంసెట్-3కి హాజరు కావొచ్చని సూచించారు. ఎంసెట్- 2 రాసిన విద్యార్థులకు కొత్తగా నిర్వహిస్తున్న ఎంసెట్- 3కి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. కొత్తగా ఎంసెట్ పరీక్ష రాయాలనుకునే వారు మాత్రమే ఎంసెట్-3 కి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇక ఎంసెట్- 2 రాసిన విద్యార్థులకు మరింత వెసులుబాటు కల్పించే దిశగా ఎంసెట్-3 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని కేసీఆర్ ప్రకటించారు.