: నాది ధర్మపోరాటం.. సహకరించండి: విజయోత్సవ సభలో బాబు
పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయోత్సవ సభలో పాల్గొన్నారు. శంషాబాద్ బస్టాండ్ వద్ద జరిగిన ఈ సభలో ఆయన మాట్లాడుతూ, తనది ధర్మపోరాటమని, అవినీతికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే తన లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని బాబు తెలిపారు. హైదరాబాద్ కు ప్రపంచ చిత్రపటంలో ప్రముఖస్థానం కల్పించామని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియంలు, ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ విమానాశ్రయం అన్నీ టీడీపీ చలవేనని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కష్టాలు రాజ్యమేలుతున్నాయని అన్నారు. తమకు సహకరిస్తే, అధికారంలోకి వచ్చాక పేదరికంలేని రాష్ట్రంగా చేస్తామని హామీ ఇచ్చారు. శారీరకంగా ఎన్ని సమస్యలు ఉన్నా అభిమానుల ఆదరణ చూశాక అవన్నీ మరచిపోయానని తెలిపారు. ప్రభుత్వ పాలనను గాడిలో పెట్టేందుకు పాదయాత్ర చేపట్టానని బాబు వివరించారు.
తాను తొలి అడుగే వేశానని.. ఇక మిగతా అడుగులు అభిమానులే వేయించారని బాబు పేర్కొన్నారు. ఇక తనకు ఇప్పటివరకు సహకరించిన వారిందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. తాను తొమ్మిదేళ్ళు పాలించానని, తనకు ముఖ్యమంత్రి పదవిపై వ్యామోహం లేదని, ప్రజల కష్టాలు తొలగించాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు.