: సీఎన్ఎన్ అంటే క్లింటన్ న్యూస్ నెట్ వర్క్, నిజాయతీ లేని న్యూయార్క్ టైమ్స్... మీడియాపై ట్రంప్ విసుర్లు


తనకు వ్యతిరేకంగా వస్తున్న వార్తల సంఖ్య పెరగడంతో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. మీడియా సంస్థలపై విరుచుకుపడుతూ, "సీఎన్ఎన్ ను చూడండి. దాన్ని క్లింటన్ న్యూస్ నెట్ వర్క్ అనవచ్చు. రోజంతా ట్రంప్.. ట్రంప్... ఓ చెడ్డోడు అని చెప్పడమే దాని పని. ఇక న్యూయార్క్ టైమ్స్ ను తీసుకోండి. అది నిజంగా నిజాయతీలేని వార్తా సంస్థ అయిపోయింది. మరో రెండు మూడేళ్ల కన్నా ఎక్కువ కాలం న్యూయార్క్ టైమ్స్ నడవలేదు" అన్నారు. ఓహియోలోని కొలంబస్ ప్రాంతంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ఈ వార్తా సంస్థలు హిల్లరీ క్లింటన్ కు అనుకూలంగా వార్తలు రాస్తున్నాయని ఆరోపించారు. తనపై సీఎన్ఎన్ తప్పుడు కథనాలు రాస్తోందని, దీంతో ఆయా పత్రికలు, సంస్థల రేటింగ్ శరవేగంగా పడిపోతోందని అన్నారు. ఇదే సమయంలో ఫాక్స్ న్యూస్ మాత్రం కొంతమేరకు నిజాయతీతో కూడిన కథనాలు అందిస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం. తనకు ఓటు వేసే వారిలో 2.25 కోట్ల మంది ట్విట్టర్ లో తన ఫాలోవర్లుగా ఉన్నారని, వారి కోసం సామాజిక మాధ్యమ వేదికపైనా ప్రచారం కొనసాగిస్తానని తెలిపారు.

  • Loading...

More Telugu News