: రెండు వైపులా గట్లు, మధ్యలో కాంక్రీట్ ఉంటే గండి ఎలా పడుతుంది?... పట్టిసీమ గండికి బాధ్యులపై చర్యలకు చంద్రబాబు ఆదేశం!
దేశంలోనే నదుల అనుసంధానానికి తొలి అడుగు వేసిన పట్టిసీమ ప్రాజెక్టుకు గండి పడిన వైనంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వేగంగా స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లా రామిలేరు వద్ద పోలవరం కుడి కాలువకు పడిన గండి కారణంగా పట్టిసీమ నీళ్లన్నీ వృథాగా పోతుండటంతో నిన్న పట్టిసీమ మోటార్లన్నింటినీ నిలిపేసిన సంగతి తెలిసిందే. దీనిపై సమాచారం అందుకున్న ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హుటాహుటిన అక్కడికి తరలివెళ్లగా, అదే సమయంలో సీఎం చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంలో ఇంజినీర్ ఇన్ చీఫ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గండి పడటానికి గల కారణాలు, పటిష్టంగా నిర్మాణం జరిగిన కాలువకు గండి పడే అవకాశముందా? అన్న కోణంలో ఆయన ఆరా తీశారు. తక్షణమే గండి పడిన ప్రదేశాన్ని పరిశీలించి, గండి పడటానికి గల కారణాలను వెలికితీసి, అందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈఎన్ సీ కూడా రామిలేరు వద్దకు పరుగులు పెట్టారు. అక్కడి గండిని పరిశీలించిన ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. కాలువకు రెండు వైపులా గట్లు, మధ్యలో కాంక్రీట్ వేసి ఉంటే గండి ఎలా పడుతుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి పటిష్ట నిర్మాణాలకు అసలు గండి పడే అవకాశమే లేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కాలువకు గండి పడిన వైనాన్ని ముమ్మాటికీ విద్రోహ చర్యగానే పేర్కొన్న ఆయన కారకులను గుర్తించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.