: ఢాకా పేలుళ్ల సూత్రధారి భారత్‌లో దాక్కుని ఉండొచ్చు: హెచ్చరించిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి సూత్రధారి భారత్‌కు పారిపోయి ఉండవచ్చని బంగ్లాదేశ్ అనుమానిస్తోంది. ఓ కేఫ్‌లో జరిగిన మారణహోమం వెనుక బంగ్లాదేశీ-కెనడియన్ అయిన తమీమ్ చౌదురి హస్తం ఉన్నట్టు భావిస్తున్న బంగ్లాదేశ్ అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. దీంతో అతను దేశం విడిచి భారత్ పారిపోయి ఉండవచ్చని భావిస్తున్నట్టు పోలీస్ చీఫ్ షాహిదుల్ హక్ తెలిపారు. ‘‘అరెస్ట్‌ను తప్పించుకునేందుకు తమీమ్ భారత్ పారిపోయి తలదాచుకుని ఉండొచ్చని భారత భద్రతా దళాలను హెచ్చరించాం’’ అని హక్ పేర్కొన్నారు. తమీమ్ కోసం పెద్ద ఎత్తున వేట కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ఇటీవల హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌తో కలిసి ఢిల్లీ వచ్చిన ఆయన తమీమ్‌పై భారత్‌ను హెచ్చరించారు. అతను భారత్‌లోనే తలదాచుకుని ఉండే అవకాశం ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), సీబీఐలను అప్రమత్తం చేశారు. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)కు బంగ్లాదేశ్‌లో కీ ఆపరేటివ్‌గా తమీమ్ వ్యవహరిస్తున్నట్టు చెప్పిన హక్.. ఢాకా మారణ హోమం వెనుక ఐఎస్ హస్తం ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పడం గమనార్హం.