: సార్క్ సమావేశాల్లో పాకిస్థాన్‌ను కడిగిపారేయనున్న భారత్!
దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి(సార్క్) హోంమంత్రుల సమావేశంలో పాల్గొననున్న భారత్.. ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్‌ను కడిగిపారేయాలని నిర్ణయించుకుంది. బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తర్వాత కశ్మీర్‌లో జరిగిన పరిణామాలు, ఉగ్రవాదులను పాకిస్థాన్ నెత్తికెత్తుకోవడం తదితర అంశాలపై సార్క్ వేదికగా నిలదీయాలని భావిస్తోంది. తనను తాను ఉగ్రవాద బాధిత దేశంగా పేర్కొంటున్న పాకిస్థాన్.. హిజ్బుల్ టాప్ కమాండర్ అయిన బుర్హాన్ వనీని అమరవీరుడిగా గుర్తించడమే కాకుండా అతడికి నివాళిగా జూలై 19ని ‘బ్లాక్ డే’గా ప్రకటించింది. సార్క్ సమావేశాల్లో పాల్గొననున్న హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ విషయాన్ని ప్రధానంగా లేవనెత్తనున్నారు. ఓ సార్క్ దేశంలో ఉగ్రవాది అయిన వ్యక్తి మరో సార్క్ దేశానికి దేశభక్తుడు ఎలా అవుతాడని ప్రశ్నించనున్నారు. బుధవారం సాయంత్రం పాకిస్థాన్ చేరుకోనున్న రాజ్‌నాథ్ సింగ్ గురువారం సార్క్ సమావేశంలో ప్రసంగిస్తారు. బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ ఈ సమావేశాలకు హాజరుకావడం లేదు. కశ్మీర్ అల్లర్లలో పాక్ పాత్ర ఉందని తెలిసినా పాక్ వెళ్లాలని నిర్ణయించుకున్న రాజ్‌నాథ్ ప్రాంతీయ సహకారంపై తమ నిబద్ధతను చాటాలని భావిస్తున్నారు. ఈ సమావేశాల సందర్భంగా భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశం లేదని ఇప్పటికే తేలిపోయింది. గురువారం పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఏర్పాటు చేసిన విందుకు రాజ్‌నాథ్ హాజరుకావడం లేదు. అదే రోజు ఆయన తిరిగి భారత్ చేరుకుంటారు.