: హ్యారిపోటర్ సిరీస్‌లలో ఏ చాప్టర్‌లో, ఏ పేజీలో, ఏ పేరాలో ఏముందో ఇట్టే చెప్పేస్తోన్న మహిళ!
హ్యారిపోటర్ పుస్తకాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతగా ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఆ సిరీస్‌లో పుస్తకాలు మార్కెట్లోకి రావడమే ఆలస్యం, లక్షల పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. ఆ పుస్తకాలకు అంతగా అభిమానులు ఉన్నారు. కానీ ఏ అభిమానిని అయినా ఏ చాప్టర్‌లో ఏ సీన్ ఉందో చెప్పమంటే అది సాధ్యమేనా? ఆ విషయాన్నే సాధ్యం చేసి చూపింది ఓ ఆస్ట్రేలియా మహిళ. బ్రిస్బేన్‌కు చెందిన 26 ఏళ్ల మహిళ బెక్కీ షారక్ ఈ అద్భుత ప్రతిభను కనబరుస్తోంది. ఆమె జ్ఞాపకశక్తికి ప్రపంచంలోని హ్యారిపోటర్ అభిమానులంతా సలాం కొడుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఏడు హ్యారీపోటర్ పుస్తకాల్లో అన్నిటినీ చదివేసిన ఆ మహిళ ఆయా పుస్తకాల్లో ఏ చాప్టర్‌లో ఏ సీన్ ఉందో ఇట్టే చెప్పేయగలదు. హ్యారీపోటర్ పుస్తకాల్లోని ప్రతి పదాన్ని వల్లెవేయగలదు. ఆ పుస్తకాల్లోని ఏ విషయం అడిగినా, అది హ్యారిపోటర్ సిరీస్‌లలో ఏ బుక్‌లో, ఏ చాప్టర్‌లో, ఏ పేజీలో, ఏ పేరాలో ఉందో ఇట్టే చెప్పేస్తూ అందరినీ అబ్బుర పరుస్తోంది. బెక్కీ షారక్ జ్ఞాపకశక్తిపై పరిశోధన జరిపిన పరిశోధకులు హైలీ సుపీరియర్ ఆటోబయోగ్రఫికల్ మెమొరీ అనే ఓ అరుదైన లక్షణం ఆమెకు ఉందని చెప్పారు. ఆమె జీవితంలో జరిగిన ప్రతి సంఘటన దీనివల్ల ఆమెకు జ్ఞాపకం ఉంటుందని వారు పేర్కొన్నారు. ఓ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో హ్యారీపోటర్ పుస్తకం ఒకటి తీసుకొని యాంకర్ పుస్తకంలోని ఒక లైన్ చదివారు. బెక్కీ షారక్ యాంకర్ చదివిన లైన్ హారీపోటర్ సిరీస్‌లో ఏ భాగమో, ఎన్నో చాప్టరో, ఏ పేజో, ఏ పేరానో వెంటనే చెప్పేసింది. అంతేగాక, ఆ పుస్తకంలోని ప్రతి పదాన్ని ఆమె చూడకుండా చెప్పేశారు. బెక్కీ షారక్ తాను చిన్నపుడు చూసిన ప్రపంచపటంలోని దేశాలు, వాటి రాజధానులను కూడా చెప్పేయగలదు. అయితే, తనకున్న అద్భుత జ్ఞాపక శక్తితో తనకు పేరు రావడమే కాదు కష్టాలూ తెచ్చిపెడుతోంది. బెక్కీ షారక్ కి రాత్రివేళ ఎలాంటి వెలుతురు, శబ్దం లేకపోతే ఏవేవో జ్ఞాపకాలు గుర్తుకొస్తాయట. దాంతో ఆమెకు నిద్రపట్టకుండా పోతోందట. దీంతో బెక్కీ షారక్ పడుకునే సమయంలో ఓ రేడియో పెట్టుకొని ఆ శబ్దాలు వింటూ పడుకుంటుంది. ఆస్ట్రేలియాలో ఇంతటి జ్ఞాపకశక్తి కలిగిన ఏకైక మహిళగా బెక్కీ షారక్ పేరుపొందింది.