: మోదీ తానిచ్చిన హామీని నిలబెట్టుకోవాలి: ప్రత్తిపాటి పుల్లారావు


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదాపై గ‌తంలో న‌రేంద్ర మోదీ ఇచ్చిన హామీలను అమ‌లు ప‌ర‌చాల‌ని రాష్ట్ర‌మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు అన్నారు. ఈరోజు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో ఆనాడు మోదీ ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీలపై మాట ఇచ్చార‌ని గుర్తుచేశారు. ప‌త్యేక హోదా కోసం అంటూ కాంగ్రెస్‌, వైసీపీ నేత‌లు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన అంశంపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆనాడు ఏపీని హ‌త్య చేసిన వారు ఇప్పుడు బంద్‌కు పిలుపునిస్తున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభ‌జ‌న‌కు ఆ రెండు పార్టీలే ఆనాడు కీలక పాత్ర పోషించాయని ఆయ‌న అన్నారు. కేంద్రం ప్ర‌భుత్వం తాము చేసిన హామీల‌పై నిల‌బ‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌త్తిపాటి పేర్కొన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలను 225కు పెంచాల్సిన బాధ్యత మోదీదేన‌ని ఆయ‌న అన్నారు. ఏపీ ప్రజల మనోభావాలను గౌర‌విస్తూ ప్ర‌ధాని మంచి నిర్ణయం తీసుకోవాలని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మం ఉద్య‌మంలా కొన‌సాగుతోంద‌ని ప్ర‌త్తిపాటి అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 191 యార్డుల్లో ఒకేరోజున 5లక్షలు మొక్కలు నాటనున్నట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 50 శాతం భూభాగం మొక్కలతో నిండి ఉండాల‌నేదే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు లక్ష్యం అని, దాన్ని సాధిస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News