: ‘ఏపీకి హోదా ఎఫెక్ట్’!... ఈ వారమంతా సభకు హాజరుకావాలని బీజేపీ ఎంపీలకు విప్ జారీ!
ఏపీకి ప్రత్యేక హోదా అంశం పార్లమెంటు వర్షాకాల సమావేశాలను కుదిపేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రతిపాదించిన ప్రైవేటు మెంబర్ బిల్లు రాజ్యసభను ఓ కుదుపు కుదిపేసింది. ఎలాగోలా ఆ బిల్లును అడ్డుకోవడంలో బీజేపీ సఫలమైంది. అయితే దీని ఫలితంగా తనకు మిత్రపక్షంగా ఉన్న టీడీపీ నిరసన బాట పట్టడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు. నేటి సమావేశాల్లో భాగంగా గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగిన టీడీపీ ఎంపీలు పార్లమెంటులో నినాదాల హోరు వినిపించారు. ఈ నేపథ్యంలో ఏ సమయంలో ఏ విపత్తు ముంచుకొస్తుందోనన్న భయంతో బీజేపీ విప్ జారీ చేసింది. ఈ వారమంతా పార్లమెంటు సమావేశాలు జరిగినన్ని రోజులు, సాంతం పార్లమెంటులోనే ఉండాలని ఆ విప్ ద్వారా తన ఎంపీలకు హుకుం జారీ చేసింది.