: అనంతపురం జిల్లాలో విషాదం.. బిడ్డలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలంలోని కొట్టాలపల్లిలో భర్తతో గొడవ పెట్టుకున్న ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చింది. అనంతరం తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమకున్న అప్పుల విషయంలో భార్యభర్తలిద్దరికి గొడవ చెలరేగినట్లు తెలుస్తోంది. కొట్టాలపల్లిలో నివసిస్తోన్న ఆనందరెడ్డి అతని భార్య భారతి(25)కి మధ్య నిన్న సాయంత్రం అప్పుల విషయంలో గొడవమొదలయింది. అయితే పెద్దలు వారికి నచ్చజెప్పాలని ప్రయత్నించారు. అనంతరం నిన్న రాత్రి ఇంట్లోకి వెళ్లిన భారతి ఈ దారుణానికి పాల్పడింది. ఈరోజు ఉదయం తన భార్యాబిడ్డల పరిస్థితిని గమనించి ఆనందరెడ్డి బయటికి వచ్చి విషయాన్ని స్థానికులకు చెప్పాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.