: సుప్రీం తీర్పు ఆరుగురు మాజీ సీఎంలకు చెంపపెట్టే!... జాబితాలో రాజ్ నాథ్ సింగ్ కూడా!
మాజీ ముఖ్యమంత్రులకు ఢిల్లీలో ప్రభుత్వ బంగళాలు కేటాయించరాదని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొద్దిసేపట క్రితం చెప్పిన సంచలన తీర్పు ఏకంగా ఆరుగురు మాజీ సీఎంలకు శరాఘాతంలా తాకింది. వీరంతా ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రులుగా పనిచేసినవారే కావడం గమనార్హం. గతంలో యూపీకి సీఎంలుగా వ్యవహరించిన కాలంలో ప్రభుత్వ బంగళాలు తీసుకున్న ఆరుగురు మాజీ సీఎంలు ఎంతకూ వాటిని ఖాళీ చేయడం లేదట. దీనిపై కొద్దిసేపటి క్రితం సంచలన తీర్పు చెప్పిన సుప్రీం ధర్మాసనం... రెండు నెలల్లోగా సదరు బంగళాలను ఖాళీ చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ బంగళాలను ఖాళీ చేయాల్సిన వారి జాబితా పరిశీలిస్తే... యూపీ ప్రస్తుత సీఎం అఖిలేశ్ యాదవ్ తండ్రి ములాయం సింగ్ యాదవ్, బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, బీజేపీ సీనియర్ నేత కల్యాణ్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్డీ తివారీ, రామ్ నరేశ్ యాదవ్ లు ఉన్నారు. ఇక మరో పేరు ఎవరిదంటే... ప్రస్తుతం కేంద్ర హోం శాఖ మంత్రి హోదాలో ఉన్న బీజేపీ సీనియర్ నేత రాజ్ నాథ్ సింగ్ కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం.