: కమలహాసన్ దగ్గరకు రజనీకాంత్ ను వెళ్లనివ్వని డాక్టర్లు!
ఇటీవల మెట్లపై నుంచి జారి పడి ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న ప్రముఖ నటుడు కమలహాసన్ ను స్వయంగా పరామర్శించాలని భావించిన సూపర్ స్టార్ రజనీకాంత్ కు నిరాశే ఎదురైంది. గత నెల 13న అమెరికా నుంచి తిరిగొచ్చిన కమల్, ఆపై తన నివాసంలో జారి పడి ప్రస్తుతం చెన్నై, మౌంట్ రోడ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా, వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ తరువాత కూడా కమల్ కాలు నొప్పి తగ్గకపోవడంతో, నిన్న వైద్యులు మరోసారి ఆపరేషన్ చేశారు. సరిగ్గా ఆ సమయానికే కమల్ ను పరామర్శించేందుకు రజనీకాంత్ రాగా, ఆపరేషన్ జరిగినందున కలిసేందుకు వీలుపడదని చెబుతూ, డాక్టర్లు అంగీకరించలేదు. దీంతో చేసేదేమీ లేక కమల్ కు స్పృహ వచ్చిన తరువాత ఫోన్ లోనే రజనీ మాట్లాడారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.