: తెలంగాణను దాటేసిన నవ్యాంధ్ర!... వాణిజ్య పన్నుల ఆదాయంలో సత్తా చాటిన ఏపీ!
ఏపీని పట్టి పీడిస్తున్న నిధుల లేమి ఇక ఎంతో కాలం ఆ రాష్ట్రానికి సమస్యగా పరిణమించే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో భారీ ఆర్థిక లోటుతో ఇబ్బంది పడుతున్న ఏపీ... నిధుల లేమికి చెక్ పెట్టేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. పన్ను ఎగవేతలకు చెక్ పెట్టడంతో పాటు లీకేజీలను అరికట్టేందుకు ఏపీ వాణిజ్యపన్నుల శాఖ చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిచ్చాయి. ఈ ఏడాది (2016-17 ఆర్థిక సంవత్సరం) తొలి త్రైమాసికంలో ఈ సంస్కరణలు మంచి ఫలితాలనిచ్చాయి. ఈ సంస్కరణల ఫలితంగా ఆదాయాన్ని భారీగా పెంచుకోవడమే కాకుండా దేశంలోనే వాణిజ్యపన్నుల వసూళ్లలో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. ఇక రాష్ట్ర విభజన తర్వాత మిగులు రాష్ట్రంగా వినుతికెక్కిన తెలంగాణను కూడా ఏపీ వెనక్కు నెట్టేసింది. వాణిజ్యపన్నుల వసూళ్లలో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో నిలవగా, తెలంగాణ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. వాణిజ్యపన్నుల వసూళ్లలో ఏపీ 14.64 శాతం వృద్ధి నమోదు చేయగా, తెలంగాణ 14.55 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసింది.