: అసభ్య చిత్రాలు చూడవద్దని చెప్పిన చెల్లెలిపై అన్న కిరాతకం!
తన ఫోన్ లో అసభ్య చిత్రాలు చూస్తున్న అన్నయ్య వరసైన యువకుడిని, వారించి తల్లిదండ్రులకు చెబుతానన్న 16 ఏళ్ల యువతిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య చేసి పాతిపెట్టాడా దుర్మార్గుడు. ఈ ఘటన తమిళనాడులోని మేట్టుపాళెయం ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, ఫక్రీస్వామి అనే వ్యక్తి కూతురు జయశ్రీ, 22వ తేదీ నుంచి కనిపించడం లేదు. పోలీసులకు సమాచారం అంది, వారు జయశ్రీ గురించి వెతుకుతుండగానే, తేక్కపట్టి పంచాయతీ కౌన్సిలర్ అమీదా ఓ సమాచారాన్ని పోలీసులకు ఇచ్చారు. ఆ అమ్మాయిని దినేష్ కుమార్ అనే యువకుడు హత్య చేశాడని, ఆ విషయాన్ని స్వయంగా తనకు చెప్పాడని అమీదా వెల్లడించింది. దీంతో అరటి తోటల్లో కూలీగా పనిచేస్తున్న దినేష్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడైంది. 22న అరటితోపులో అశ్లీల చిత్రాలు చూస్తుండగా, బహిర్భూమి నిమిత్తం వచ్చిన జయ తనను చూసి, తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించడంతో భయపడ్డానని, ఆపై కోపంతో అత్యాచారం చేసి హత్య చేశానని నిందితుడు అంగీకరించాడు. అదే తోటలో ఆమెను పాతిపెట్టినట్టు చెప్పాడు. దీంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం పంపిన పోలీసులు కేసును దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.