: మెహబూబా వ్యాఖ్యల్లో నిజం లేదు.. బుర్హాన్ వనీ అని తెలిసే మట్టుబెట్టారు: బీజేపీ
హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, అధికార పార్టీలో భాగస్వామి అయిన బీజేపీ మధ్య పొరపొచ్చాలు తెచ్చినట్టు కనిపిస్తోంది. ఆ ఇంట్లో దాగుంది బుర్హాన్ వనీ అని భద్రతా దళాలకు తెలిసి ఉంటే అతను బతికి ఉండేవాడని ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పేర్కొన్న సంగతి తెలిసిందే. అది ఎవరో వారికి తెలియకపోవడం వల్లే ఎన్‌కౌంటర్ చేశారని, లేకుంటే వనీకి ఓ చాన్స్ ఇచ్చి ఉండేవారని ముఫ్తీ పేర్కొన్నారు. అధికార పీడీపీ కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండించింది. అక్కడ దాక్కున్నది ఉగ్రవాది బుర్హాన్ వనీ అని పక్కా సమాచారం అందిన తర్వాతే భద్రతా దళాలు అతడిని కాల్చి చంపినట్టు పేర్కొంది. సమాచారం లేకుండా భద్రతా దళాలు రంగంలోకి దిగే అవకాశమే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సత్ పాల్ శర్మ పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్ భారత్‌లో అంతర్భాగం కాదని భావిస్తున్న వారు తప్పకుండా ఉగ్రవాదులేనని, వారిని మట్టుబెట్టాల్సిందేనని అన్నారు. అందులో భాగంగానే ఉగ్రవాదులను దళాలు ఏరివేస్తున్నాయని వివరించారు.