: 25 వేల ఆడుగుల ఎత్తునుంచి ప్యారాచూట్ లేకుండా దూకి బతికిన తొలి స్కై డైవర్
ఇది నిజంగా అద్భుతమైన ఘటన. ప్రపంచ స్కై డైవింగ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఎలాంటి వింగ్ సూట్, ప్యారాచూట్ లేకుండా లూక్ అకిన్స్ అనే స్కై డైవర్ 25 వేల అడుగుల ఎత్తున ఉన్న హెలికాప్టర్ నుంచి దూకి, కింద ఏర్పాటు చేసిన వలపై సురక్షితంగా దుమికాడు. కాలిఫోర్నియాలోని సిమీ వ్యాలీలో నేడు ఈ ఫీట్ ను అకిన్స్ చేశాడు. 20 అంతస్తుల ఎత్తున, ఫుట్ బాల్ మైదానంలో మూడో వంతు సైజున్న నెట్ ను ఏర్పాటు చేయగా, రెండు నిమిషాల పాటు గాల్లో ప్రయాణించి, 120 మైళ్ల వేగంతో వచ్చిన అకిన్స్ దానిపై పడ్డాడు. ఈ ఫీట్ ను చూసేందుకు అతని భార్యతో పాటు కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. కొన్ని నెలల పాటు శిక్షణ అనంతరం అకిన్స్ ఈ రికార్డును నెలకొల్పేందుకు నిర్ణయించుకున్నాడు. కాగా, 42 సంవత్సరాల అకిన్స్ ఇప్పటివరకూ 18 వేల మార్లు స్కై డైవింగ్ చేశాడు. 'ఐరన్ మ్యాన్ 3' తదితర చిత్రాలకు స్టంట్స్ కూడా చేశాడు.