: 'పీప్లీ లైవ్' కో డైరెక్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని నిర్ధారించిన ఢిల్లీ న్యాయస్థానం
గతంలో వచ్చిన 'పీప్లీ లైవ్' బాలీవుడ్ సినిమాకు కో-డైరెక్టర్ గా పనిచేసిన మహమూద్ ఫారూఖీని ఢిల్లీ న్యాయస్థానం రేపిస్టుగా నిర్ధారించింది. న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీ విద్యార్థిని (34 ఏళ్ల మహిళ) రిసెర్చ్ కోసం 2015లో ఇండియా వచ్చారు. కొన్ని రిఫరెన్సుల కోసం చారిత్రక పరిశోధక రచయిత అయిన మహమూద్ ఫారూఖీని ఆమె పలు సందర్భాల్లో కలవాల్సి వచ్చింది. ఈ పరిచయంతో ఆమెను 2015 మార్చి 28న తన నివాసం (ఢిల్లీ)లో జరిగిన పార్టీకి ఆమెను ఫారూఖీ ఆహ్వానించాడు. దీంతో ఆ పార్టీకి ఆమె హాజరైంది. దీనిని అలుసుగా తీసుకున్న ఫారూఖీ ఆ రాత్రి ఆమెను పక్కగదిలోకి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. తరువాత అమెరికా వెళ్లిపోయిన బాధితురాలు అతనితో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపింది. ఈ సందర్భంగా జరిగిన ఘనటపై ఫారూఖీ క్షమాపణలు కోరాడు. పలు ప్రత్యుత్తరాల్లో జరిగిన ఘటన గురించి ప్రస్తావించాడు. అయితే ఆ రోజు జరిగిన అత్యాచారానికి ఎలాంటి సాక్ష్యం లేని బాధితురాలు ఆ ఉత్తరప్రత్యుత్తరాలను సాక్ష్యంగా ఉపయోగించి, రాయబార కార్యాలయం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో 21 జూన్ 2015న పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. ఏడాదిపాటు సాగిన విచారణలో ఫారూఖీ అత్యాచారానికి పాల్పడినట్లు స్పష్టమైంది. దీంతో అతనికి న్యాయస్థానం ఆగస్టు 2న శిక్ష ఖరారు చేయనుంది. విలియం డార్లింపుల్ ప్రఖ్యాత రచన 'వైట్ మొఘల్స్' కు ఫారూఖీ సహకారం అందించడం విశేషం.