: ఉద్ధవ్ ఠాక్రేతో రాజ్ ఠాక్రే మంతనాల రహస్యం ఇదే!
మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో తాజాగా భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. వీరిద్దరి భేటీకి మధ్య పెద్ద కారణమే ఉంది. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే తాను మరణించడానికి ఏడాది ముందు 2011లో తన ఆస్తి పంపకాల అంశంలో ఓ వీలునామా రాశారు. తన ఆస్తిలో అధిక భాగాన్ని తన చిన్న కుమారుడయిన ఉద్ధవ్ ఠాక్రే పేరున రాసి, రెండో కుమారుడయిన జైదేవ్ ఠాక్రేకు కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ జైదేవ్ కుమారుడు ఐశ్వర్యా ఠాక్రే పేరిట కొంత వాటా రాశారు. తనకు ఆస్తిలో వాటా దక్కకపోవడంతో బాల్ ఠాక్రే రెండో కుమారుడయిన జైదేవ్ ఠాక్రే కోర్టుకెళ్లారు. తన తండ్రి మతిస్థిమితం లేని వ్యక్తి అని పేర్కొంటూ.. ఉద్ధవ్ ఠాక్రే తన తండ్రితో ఆస్తిలో అధిక భాగాన్ని రాయించుకున్నారని కోర్టులో ఆయన దావా వేశారు. ఈ అంశంపై తమ కుటుంబమే బజారున పడుతుందని భావించిన ఉద్ధవ్.. తన అన్న జైదేవ్‌తో రాజీ చేసుకోవాలని అనుకున్నారు. దీంతో, తన కజిన్ అయిన రాజ్ ఠాక్రేతో ఆయన భేటీ అయి ఈ అంశంపై చర్చించారు. గతేడాది జైదేవ్ ఆస్తి పంపకాల అంశాన్ని రాజీతోనే తేల్చుకుందామని చెప్పారు. అయితే అప్పుడు ఉద్ధవ్ తన అన్న అభ్యర్థనను లెక్కచేయలేదు. కానీ ఇప్పుడు తానే స్వయంగా రాజీ చేసుకోవాలని భావిస్తుండడం గమనార్హం.