: స్వచ్ఛందంగా భూములిస్తున్నారని సర్కార్ అంటోంది.. మరి నిర్బంధాలెందుకు?: కోదండరాం
హైదరాబాద్‌లో అసెంబ్లీ సమీపంలోని గన్‌పార్క్ వద్ద నుంచి తెలంగాణ న్యాయవాదుల జేఏసీ మెదక్ జిల్లా మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ప్రాంతానికి కొద్దిసేపటి క్రితం బయలు దేరింది. న్యాయవాదుల జేఏసీ వాహనర్యాలీని టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం ప్రారంభించారు. ‘రైతులు స్వచ్ఛందంగా భూములిస్తున్నారని చెబుతోన్న ప్రభుత్వం వారిని చూడడానికి వెళుతోన్న నేతలపై ఎందుకు నిర్బంధాలు విధిస్తోంది?’ అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. మల్లన్నసాగర్‌కి తాము వ్యతిరేకం కాదని కోదండరాం స్పష్టం చేశారు. దానికి సంబంధించి నిర్దిష్టమైన ప్రణాళిక బహిరంగ పరచాలని ఆయన డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్పై ప్రజల్లో అనుమానాలున్నాయని, వాటిపై తెలంగాణ సర్కార్ స్పష్టత ఇవ్వాలని అన్నారు. మల్లన్నసాగర్ కు వెళుతున్న నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం భావ్యం కాదని ఆయన అన్నారు.