: పొమ్మంటే బయటకు వచ్చేద్దాం!... బీజేపీతో తెగదెంపుల దిశగా చంద్రబాబు కీలక వ్యాఖ్య!
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ మొండి చేయి చూపిన వైనంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రాజ్యసభలో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చ ముగిసిన తర్వాత ఢిల్లీలోని పార్టీ ఎంపీలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ సర్కారును నిలదీయడంలో విఫలమయ్యారంటూ చంద్రబాబు ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయ పొత్తులపై కొత్త వాదనలకు తెర లేపుతున్నాయి. ‘‘ఏపీకి న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన వాటి విషయంలో కేంద్రం వైఖరి దారుణంగా ఉంది. దీనిపై మనం పోరాడాల్సిందే. వెనుకాడాల్సిన అవసరమే లేదు. పొమ్మంటే కేంద్ర మంత్రివర్గం నుంచి బయటకు వచ్చేద్దాం. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీ పడేది లేదు’’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా, ఇతర అంశాల విషయంలో బీజేపీ సర్కారు ఇలాగే వ్యవహరిస్తే ఆ పార్టీతో పొత్తును రద్దు చేసుకునేందుకు కూడా వెనుకాడేది లేదన్న రీతిలో చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.