: సల్మాన్‌ఖాన్ జింకల వేట కేసులో ప్రాణ భయం ఉందన్న సాక్షి.. రక్షణ కోసం హోంమంత్రికి లేఖ
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ జింకల వేట కేసులో ప్రధాన సాక్షి హరీష్ దులానీ తనకు ప్రాణ హాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతూ శుక్రవారం హోంమంత్రి గులాబ్‌చంద్ కటారియాకు తన అడ్వకేట్ ద్వారా ఫ్యాక్స్‌లో లేఖ పంపించారు. జింకల వేట కేసులో రాజస్థాన్ హైకోర్టు సోమవారం సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న దులానీ కోర్టు తీర్పు అనంతరం ఒక్కసారిగా బయటకు వచ్చారు. తీర్పు అనంతరం తనకు బెదిరింపులు ఎక్కువ అయ్యాయని హోంమంత్రికి పంపిన లేఖలో ఆవేద వ్యక్తం చేశారు. బెదిరింపుల కారణంగానే 2006లో కోర్టుకు హాజరు కాలేకపోయానని పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్ కేసులో తానే ప్రధాన ముద్దాయిని అని పేర్కొన్న దులానీ 1998లో కోర్టు ఎగ్జామినేషన్ పూర్తయినప్పటి నుంచి బెదిరింపులు వస్తున్నట్టు తెలిపారు. దీంతో ఎవరికీ చెప్పకుండా జోధ్‌పూర్ నుంచి వెళ్లిపోయానని, ఇప్పుడు ఈ కేసులో తీర్పు రావడంతో మళ్లీ వచ్చానని వివరించారు. అయితే వచ్చిన మరుక్షణం నుంచి తనకు, తన కుటుంబానికి మళ్లీ బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు. కాబట్టి తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని హోంమంత్రిని కోరారు.