: చైనా గోడ కోసం వాడిన రాళ్లు, ఇటుకలు దొంగల పాలవుతున్నాయట.. కనుమరుగవుతున్న ‘ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’!
చైనా పేరు గుర్తుకు రాగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఆ దేశంలోని 21 వేల కిలోమీటర్ల మేర నిర్మితమైన అతి పెద్ద చైనా గోడ (గ్రేట్ వాల్ ఆఫ్ చైనా). క్రీ.పూ మూడో శతాబ్దంలో మొదలు పెట్టిన ఈ గోడ నిర్మాణాన్ని మింగ్ రాజుల(1368-1644) పాలన వరకు క్రమక్రమంగా నిర్మిస్తూ వచ్చారు. ప్రపంచ వింతల్లో ఒకటిగా ఎన్నో ఏళ్ల నుంచి చైనా గోడ నిలుస్తోంది. అయితే, ఎంతో ఘనతను సొంతం చేసుకున్న చైనా గోడ కోసం వాడిన రాళ్లు, ఇటుకలు రోజురోజుకీ అక్కడి నుంచి మాయమైపోతున్నాయి. ఇది దొంగల పనే అని అధికారులు స్పష్టం చేశారు. శిథిలంగా మారుతున్న ఈ గోడను రక్షించుకోవడానికి చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గోడలో ఉన్న రాళ్లు, ఇటుకలను స్థానికులే దొంగిలిస్తున్నట్లు, వాటిని వారి ఇళ్ల నిర్మాణంలో ఉపయోగించడంతో పాటు విదేశీ పర్యాటకులకు అమ్మేందుకు దొంగిలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో కూడా చైనా గోడ కొంత శిథిలావస్థకు చేరుకుంది. చైనా గోడను రక్షించుకోవడానికి ఆ దేశ ప్రభుత్వం దొంగలను పట్టుకునే పనిలో పడింది. గోడ వివరాలను తెలియజేసేందుకు హాట్‌లైన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, గోడ పొడుగునా గట్టి నిఘా పెట్టబోతోంది. కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి చైనా గోడలో కొంత భాగం ధ్వంసం చేసి, ఆ దృశ్యాలను వీడియో తీసి మరీ ఆన్లైన్లో పెట్టాడు. దీంతో ప్రభుత్వం తమ చర్యలను మరింత పటిష్టం చేయాలని చూస్తోంది. ఇప్పటికే చైనా గోడ సుమారు 30 శాతం కనుమరుగయినట్లు అధికారులు పేర్కొన్నారు.