: తల్లిదండ్రులను బెంబేలెత్తించి... నవ్వించిన పిల్లల ప్రేమకథ!
సినిమాలు, సీరియళ్ల ప్రభావం పిల్లలపై పెను ప్రభావం చూపుతున్నాయి. తాజాగా గుజరాత్ లో చోటుచేసుకున్న ఓ సంఘటన తల్లిదండ్రులను మొదట్లో బెంబేలెత్తించి, ఆఖరికి నవ్వుల్లో ముంచెత్తింది. వివరాల్లోకి వెళ్తే... అహ్మదాబాద్ లోని ఓ ప్రముఖ స్కూల్ లో ఆరోతరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ప్రేమలో పడ్డారు. దీంతో ఈ పెద్దోళ్లు తమ ప్రేమను అర్థం చేసుకోరని భావించి...యూనిఫాంలతోనే వారిద్దరూ వెళ్లిపోయారు. సాయంత్రమైనా పిల్లలు రాకపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెంది పోలీసులకు పిల్లలు తప్పిపోయారని ఫిర్యాదు చేశారు. పిల్లల్లో అబ్బాయి వద్ద సెల్ ఫోన్ ఉండడంతో దాని సిగ్నల్ అధారంగా వారి ఆచూకీ ట్రేస్ చేయాలని భావించారు. ఇలాంటి ప్రయత్నాలు ఉంటాయని భావించారో ఏమో కానీ ముందు జాగ్రత్తగా సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో వారి ఆచూకీ దొరకలేదు. అహ్మదాబాద్ దగ్గర్లోని నడియాడ్ చేరుకున్న పిల్లలిద్దరూ అద్దెకు గదులకోసం ప్రయత్నించారు. అయితే వారి వయసు, ఒంటిపై స్కూలు యూనిఫాం, భుజాన స్కూలు బ్యాగులు ఉండడం చూసి ఎవరూ ఆశ్రయం కల్పించలేదు. దీంతో స్నేహితుడి సాయం తీసుకునేందుకు సెల్ ఫోన్ స్విచ్ ఆన్ చేయగానే సైబర్ క్రైం పోలీసులు సిగ్నల్ ట్రేస్ చేశారు. నడియాడ్ లో వారున్నారని గుర్తించి, అక్కడి పోలీసులను సిగ్నల్ చూపించిన ప్రాంతానికి పంపి వారిని స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ వీరి ప్రేమ కథ తెలుసుకుని పోలీసులు, తల్లిదండ్రులు నవ్వుకున్నారు. పోలీసులు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.