: పోగొట్టుకున్న టెన్త్ మెమోను వాట్సప్‌ సాయంతో అరగంటలోనే దక్కించుకున్న యువకుడు


సోష‌ల్‌మీడియా.. ఆధునిక మాన‌వుని జీవితంలో ఒక భాగం. దాని వ‌ల్ల యువ‌త‌ ఎన్ని న‌ష్టాలు కొనితెచ్చుకుంటున్నా ఎన్నో సంద‌ర్భాల్లో మంచి కూడా జ‌రుగుతోంది. ప‌దో త‌ర‌గ‌తి ఒరిజిన‌ల్ మెమోను పోగొట్టుకుని వాట్స‌ప్ ద్వారా దాన్ని అర‌గంట‌లో తిరిగి పొందాడో యువ‌కుడు. వ‌రంగ‌ల్ జిల్లా నెల్లికుదురు మండలం తారాసింగ్‌బావిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవ‌ర్‌ గుగులోత్‌ సైదులు రెండు రోజుల క్రితం త‌న టెన్త్ మొమోను పోగొట్టుకున్నాడు. తాను చ‌దువుకున్న‌ ఐటీఐ కళాశాలలో ఉన్న‌ త‌న‌ టెన్త్‌ మెమోను తీసుకున్న సైదులు తన ఆటోలో సీటు కింద దాన్ని ఉంచాడు. అయితే, నిన్న‌ వరంగల్‌ నిట్‌ ప్రాంతం నుంచి త‌న ఆటో వెళుతుండగా మెమో జారి రోడ్డుపై పడిపోయింది. అయితే, త‌న వ‌ద్ద ఉన్న స్మార్ట్ ఫోన్‌లో వాట్స‌ప్ ఓపెన్ చేసిన సైదులుకి ‘మాఊరు ఇనుగుర్తి’ అనే వాట్స‌ప్‌ గ్రూప్‌లో ఓ వ్య‌క్తి చేసిన పోస్ట్ క‌నిపించింది. కాజీపేట ఎఫ్‌సీఐ ఉద్యోగి బేతమల్ల వినోద్ వాట్స‌ప్ గ్రూప్‌లో త‌న‌కు ఓ మెమో దొరికిందని దాని ఫోటో తీసి పెట్టాడు. త‌న గ్రామం కేసముద్రం మండలం ఇనుగుర్తి అని పేర్కొని ఆ మెమోను పోగొట్టుకున్న వారు త‌న వ‌ద్ద‌కు వ‌చ్చితీసుకోవ‌చ్చ‌ని వినోద్ వాట్స‌ప్‌లో పేర్కొన్నాడు. వినోద్ చేసిన పోస్ట్‌ని ఇదే గ్రూప్‌లో సభ్యుడైన సైదులు చూసి తాను పోగొట్టుకున్న తన మెమోను వినోద్ వ‌ద్ద నుంచి తీసుకున్నాడు. తాను పోగొట్టుకున్న మెమో వెంట‌నే దొర‌క‌డం ప‌ట్ల సైదులు హ‌ర్షం వ్య‌క్తం చేశాడు.

  • Loading...

More Telugu News