: రూ. 10 వేల కోట్ల తప్పులో కాలేసిన భారత్... మిగ్-29 విమానాలపై కాగ్ కీలక నివేదిక
దేశ రక్షణ, సముద్ర జలాల పరిరక్షణ నిమిత్తం రష్యా నుంచి మిగ్ - 29కే విమానాలను కొనుగోలు చేసేందుకు చేసుకున్న డీల్ ఇండియాకు అంతగా ఉపకరించలేదని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) అభిప్రాయపడింది. మిగ్ విమానాల కొనుగోలుకు రూ. 10,500 కోట్లను 2004 నుంచి 2010 మధ్య చెల్లించి తప్పు చేసిందని పార్లమెంటుకు సమర్పించిన తన తాజా నివేదికలో కీలక ఆరోపణలు చేసింది. బాంబులను జార విడవడం నుంచి తీర పరిరక్షణ వరకూ మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్ గా, భావించి కొన్న ఈ విమానాల్లో తరకూ ఇంజన్ సమస్యలు తలెత్తుతున్నాయని, ఒకవేళ వీటన్నింటినీ వినియోగించాల్సిన అవసరం ఏర్పడిన సమయంలో 50 శాతం మాత్రమే సిద్ధంగా ఉంటాయని పేర్కొంది. కాగా, ప్రస్తుతం దేశంలో 45 మిగ్-29కే యుద్ధవిమానాలు ఉన్నాయి. వీటిల్లో అత్యధికం యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై మోహరించి ఉంటాయి. ప్రస్తుతం కొచ్చిలో నిర్మితమవుతున్న ఐఎన్ఎస్ విక్రాంత్, ఆపై తయారయ్యే ఐఎన్ఎస్ విశాల్ లపై మరికొన్నింటిని మోహరించాలన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే, వీటిల్లో సగానికి పైగా విమానాల్లో తయారీ లోపాలు ఉన్నప్పటికీ వాటిని సరిచేసేందుకు మార్గాన్వేషణ చేయలేదని కాగ్ ఆరోపించింది. విమానాలు గాల్లో ఎగిరిన వేళ, వీటి భద్రత ప్రశ్నార్థకమేనని వ్యాఖ్యానించింది. ఇప్పటివరకూ 10కి పైగా సింగిల్ ఇంజన్ ల్యాండింగ్ కేసులు నమోదయ్యాయని గుర్తు చేసింది. ఈ సమస్యను అంత త్వరగా పరిష్కరించలేమని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని నావికాదళ అధికారి ఒకరు తెలిపారు. మిగ్-29కే విమానాల కొనుగోలు తరువాత, మరే ఇతర డీల్ కుదరలేదని ఆయన తెలిపారు. రష్యా నుంచి వచ్చిన మరమ్మతు టీం, గోవాలో మకాం వేసి యుద్ధ విమానాలను గాడిలో పెట్టే పనుల్లో నిమగ్నమై ఉందని వివరించారు.