: మహబూబ్ నగర్ లో విషాదం... కరెంట్ షాక్ తో ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందిన విషాద సంఘటన మహబూబ్ నగర్ జిల్లా కోస్గి మండలం తొగాపూర్ లో జరిగింది. ఈ గ్రామానికి చెందిన వెంకటయ్య(60) కుటుంబ సభ్యులు పత్తి చేనులో పనికని ఈరోజు ఉదయం వెళ్లారు. ఈ క్రమంలో అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగలడంతో వెంకటయ్య కుప్పకూలిపోయాడు. ఇది గుర్తించిన కొడుకు కిష్టప్ప (34) తండ్రిని రక్షించేందుకు వెళ్లి అతనూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. కిష్టప్ప భార్య విద్యుత్ కనెక్షన్ కట్ చేసేందుకు పరిగెత్తుకుంటూ వెళుతున్న సమయంలో అతని తల్లి అమృతమ్మ (56) తన కొడుకును రక్షించేందుకని అతన్ని పట్టుకోవడంతో ఆమె కూడా ప్రాణాలు విడిచింది. ఇలా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఒకేసారి మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.