: ప్రత్యేక హోదాకు మోకాలొడ్డేవారు ఎవరైనా మాకు శత్రువులే!: టీడీపీ ఎంపీ కేశినేని నాని


దేశ రాజధాని ఢిల్లీలో ఏపీకి ప్రత్యేక హోదా అంశం మళ్లీ రంగ ప్రవేశం చేసింది. నిన్న రాజ్యసభలో దాదాపు మూడు గంటల పాటు ఈ అంశంపై చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో ప్రతిపాదించిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చకు నేటి సమావేశాల్లో భాగంగా రాజ్యసభ నాయకుడి హోదాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వివరణ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం టీడీపీ నేత, ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని విజయవాడలో మీడియా ముందుకు వచ్చారు. కేవీపీ బిల్లుకు అనుకూలంగా తాము ఓటు వేస్తామని నాని ప్రకటించారు. బిల్లు ఎవరు పెట్టారన్న అంశంతో పనిలేకుండా ఏపీ ప్రయోజనాలే పరమావధిగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం పోరాడే వారు ఎవరైనా తమకు మిత్రులేనని నాని పేర్కొన్నారు. అదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదాకు మోకాలొడ్డే వారు ఎవరైనా తమకు శత్రువులేనని ఆయన తేల్చిచెప్పారు. ప్రత్యేక హోదా వల్ల ఏపీకి ఒనగూరే ప్రయోజనాలు ఏమీ లేవని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించడం సరికాదని కూడా నాని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News