: భారీ వర్షాలకు న్యూఢిల్లీ అస్తవ్యస్తం... ప్రజలను బయటకు రావద్దంటున్న అధికారులు
భారీ వర్షాలకు దేశ రాజధాని అతలాకుతలమైంది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడ చూసినా మూడు నుంచి నాలుగడుగుల్లోతు నీటిలో కూరుకుపోయి ఎటూ కదల్లేని స్థితిలో వందలాది వాహనాలు రహదారులపైనే ఆగిపోగా, ఢిల్లీ నుంచి గుర్గావ్ వైపు వెళ్లే ప్రధాన రహదారి సహా, అన్ని మార్గాలూ మూసుకుపోయాయి. సెంట్రల్ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వాసులు ఇళ్లకే పరిమితం కావాలని, బయటకు రావద్దని, ముఖ్యంగా గుర్గావ్ వైపు ప్రయాణాలు సాగించవద్దని పోలీసు శాఖ ట్వీట్ చేసింది. ఎన్ హెచ్ 8పై పూర్తిగా ట్రాఫిక్ జాం అయిందని, ఇది ఎప్పుడు కదులుతుందో చెప్పే పరిస్థితి లేదని అధికారులు అంటున్నారు. ఆంబియన్స్ మాల్ నుంచి మనేసర్ వరకూ జాంప్యాక్ అయిందని, హీరో హోండా చౌక్ వద్ద భారీ స్థాయిలో వరద నీరు చేరిందని, కనీసం మధ్యాహ్నం వరకూ ఈ దారిలో ప్రయాణాలు వద్దని పోలీసులు తెలిపారు. ఇక సామాజిక మాధ్యమాల్లో ఢిల్లీ ట్రాఫిక్ అవస్థలు, రహదారులపై నీళ్లు నిండిన చిత్రాలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది తమ కార్లను నీటితో నిండిన రోడ్లపై వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. తనకు కారును బదులు స్పీడ్ బోటును పంపితేనే ఆఫీసులకు వస్తామంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. గుర్గావ్ ను గురుగ్రామ్ గా మార్చిన ప్రభుత్వం, రహదారి, డ్రైనేజీ వ్యవస్థలను పట్టించుకోకుండా గురు ద్రోణాచార్య కాలానికి ప్రజలను నెట్టేసిందని విమర్శలు వస్తున్నాయి.