: ఐరన్ రాడ్ థియరీ నిరూపిస్తే రూ.10 లక్షలిస్తా!: నిర్భయ కేసులో డిఫెన్స్ లాయర్ కొత్త వాదన


2012లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనలో దోషుల తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ఎంఎల్ శర్మ ఓ సంచలన ప్రకటన చేశారు. దేశాన్నే కుదిపేసిన ఈ ఘటనలో బాధితురాలిపై కదులుతున్న బస్సులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు ఆమె శరీరంలోకి ఇనుప రాడ్ ను చొప్పించి లోపలి అవయవాలను బయటకు లాగినట్లు పోలీసులు కోర్టుకు నివేదించారు. ఈ కేసులో విచారణ పూర్తి చేసిన కోర్టు నిందితులకు మరణశిక్ష విధించగా, ఢిల్లీ హైకోర్టు సదరు తీర్పును సమర్ధించింది. దీంతో దోషులు సుప్రీంకోర్టుకి అపీల్ చేసుకున్నారు. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనం ముందు సోమవారం నాడు ఈ కేసు విచారణ జరిగింది. నేడు కూడా జరగనుంది. ఈ క్రమంలో బాధితురాలి శరీరంలోకి నిందితులు ఇనుప రాడ్ ను చొప్పించారన్న వాదనపై నిందితుల తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదించిన అనంతరం కోర్టు బయట సంచలన ప్రకటన చేశారు. నిర్భయ ఘటనలో ఇనుప రాడ్ థియరీని నిరూపించిన వారికి తాను రూ.10 లక్షల బహుమతిని అందజేస్తానని ఆయన ప్రకటించారు. బాధితురాలు గాని, ఆమె స్నేహితుడు గాని ఇనుప్ రాడ్ అంశాన్ని ప్రస్తావించలేదని చెప్పిన ఆయన... పోలీసులే కల్పిత కథనాలతో ఇనుప రాడ్ థియరీని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. సామూహిక అత్యాచారం తర్వాత ఆసుపత్రిలో పూర్తి స్పృహలోనే బాధితురాలు వాంగ్మూలమిచ్చిందని శర్మ పేర్కొన్నారు. బాధితురాలి వాంగ్మూలంలో ఇనుప రాడ్ ప్రస్తావనే లేకున్నా... పోలీసులు ఈ వాదనను ఎలా చేరుస్తారని కూడా ఆయన ప్రశ్నించారు. నిర్భయ ఘటనలో ఇనుప రాడ్ థియరీని నిరూపించిన వారికి తాను రూ.10 లక్షల బహుమానాన్ని ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. నిర్భయ నిందుతుల్లోని ముఖేశ్, పవన్ ల తరఫున శర్మ వాదనలు వినిపించారు.

  • Loading...

More Telugu News