: ట్రంప్ పై హిల్లరీ మాటల తూటాలు!... అమెరికా విచ్ఛిన్నమే ట్రంప్ కోరిక అని విమర్శ!
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. రిపబ్లికన్ పార్టీ తరఫున ఆ దేశ రియల్ ఎస్టేట్ టైకూన్ డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వం ఖరారు కాగా... డెమొక్రటిక్ పార్టీ తరఫున ఆ దేశ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి, మాజీ విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ బరిలోకి దిగుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్న తొలి మహిళగా హిల్లరీ రికార్డు సృష్టించారు. ఇక ట్రంప్ పై విజయం సాధిస్తే... అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఆమె చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఈ క్రమంలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వం ఖరారైన వెంటనే కీలక ప్రసంగం చేసిన హిల్లరీ ... తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై మాటల తూటాలను పేల్చారు. అమెరికా విచ్ఛిన్నాన్ని ట్రంప్ కోరుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ కారణంగా ట్రంప్ ను నమ్మొద్దని ఆమె అమెరికన్లకు సూచించారు. ట్రంప్ కు అమెరికా కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని కూడా హిల్లరీ సంచలన ఆరోపణలు చేశారు. తనకు మద్దతిచ్చిన అమెరికన్లకు ఆమె కృతజ్ఞతలు చెప్పారు.