: సర్కారు ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేయడం ప్రభుత్వానికి చెంపదెబ్బ లాంటిది: పొన్నం ప్రభాకర్


కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో విద్యావ్యవస్థను శవపేటికలో పెట్టేసిందని మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. వైస్ ఛాన్స‌ల‌ర్‌ల‌ను నియ‌మిస్తూ రాష్ట్ర స‌ర్కార్ జారీ చేసిన జీవోను అర్హతల ఆధారంగా నియామ‌కం జ‌ర‌గ‌లేదంటూ హైకోర్టు రద్దు చేయడం పట్ల ఆయన ఈరోజు హైదరాబాద్‌లో స్పందిస్తూ.. తెలంగాణ ప్రభుత్వానికి ఈ అంశం చెంపదెబ్బలాంటిదని అన్నారు. కోర్టులు విద్యా సంబంధిత విష‌యాల్లో స‌ర్కారు తీరుని తప్పుబట్టడం ఇది 15వ సారి అని ఆయ‌న పేర్కొన్నారు. విశ్వ‌విద్యాల‌యాల గౌరవాన్ని పెంచేలా త‌మ పార్టీ ఆనాడు చ‌ర్య‌లు తీసుకుంటే ఇప్పుడు కేసీఆర్ స‌ర్కార్ తప్పుడు విధానాలతో వాటి గౌర‌వాన్ని దిగ‌జార్చేలా ప్ర‌వ‌ర్తిస్తోందని పొన్నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ధ‌ర్మాసనం ఈరోజు ఇచ్చిన‌ తీర్పు ప‌ట్ల‌ నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల‌ని ఆయ‌న అన్నారు. కేసీఆర్ స‌మ‌గ్రంగా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నార‌ని, అందుకే కోర్టులు ప్ర‌భుత్వ తీరుపై ఇలా తీర్పులిస్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు. త‌మ పార్టీ గ‌తంలో చేసిన పాల‌న‌ను చూసైనా కేసీఆర్ నేర్చుకోవాలని ఆయ‌న వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News