: పీకల దాకా తాగి కారుతో రోడ్డుపై హల్‌చల్ చేసిన వ్యక్తులు... దేహశుద్ధి చేసిన స్థానికులు!
అర్ధరాత్రి పీకల దాకా తాగి కారుతో రోడ్డుపై హల్‌చల్ చేసిన ఇద్దరిని స్థానికులు చితక్కొట్టి పోలీసులకి అప్పగించిన ఘటన విజయవాడ బందర్‌రోడ్‌లో చోటుచేసుకుంది. అడ్డదిడ్డంగా కారును నడుపుతూ వెళుతోన్న వీరు వారి ముందు నుంచి వెళుతోన్న మరో కారుని ఢీ కొట్టి, ఆ తరువాత కూడా కారు ఆపకుండా ఓ బైక్‌ను, పాదచారులను ఢీ కొట్టారు. అప్పటికీ కారు ఆపకుండా ముందుకు వెళ్లారు. అయితే కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో వారిని స్థానికులు పట్టుకుందామని వెళ్లారు. అయితే, వారు కారులోంచి దిగి అదే కారు పైకి ఎక్కి హల్‌చల్ చేశారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు వారిని పట్టుకొని దేహశుద్ధి చేసి, పోలీసులకి అప్పగించారు. అరెస్టయిన వ్యక్తులు కరీంనగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ముత్యాల శివారెడ్డి, సునందన్ శాస్త్రిగా పోలీసులు గుర్తించారు. వారు హైదరాబాద్ నుంచి నర్సీపట్నానికి వెళుతున్నట్లు పేర్కొన్నారు. వీరిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.