: సినీ పరిశ్రమ ఎలా ఉంటుందో తెలుసా?: అభిషేక్ బచ్చన్
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్...దిగ్గజ నటుడి కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు. 2000లో ‘రెఫ్యూజీ’ సినిమాతో అరంగేట్రం చేసిన అభిషేక్ ను పరాజయం పలకరించింది. ఆ తరువాత నటించిన గురు, ధూమ్, బంటీ ఔర్ బబ్లీ, దోస్తానా, బోల్ బచ్చన్ బోల్ వంటి సినిమాలతో ఆకట్టుకున్నప్పటికీ స్టార్ హీరో మాత్రం కాలేకపోయాడు. తాజాగా ప్రో కబడ్డీ లీగ్ యజమానిగా కీలకపాత్ర పోషిస్తున్న అభిషేక్ తన 16 ఏళ్ల సినీ జీవితంపై మాట్లాడుతూ, ఈ 16 ఏళ్ల కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలను చవి చూశానని అన్నాడు. ఇంకా ఎంతో ప్రయాణం ఉందని చెప్పిన అభిషేక్, ఇంత వరకు తన కెరీర్ లో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని పేర్కొన్నాడు. హిందీ సినీ పరిశ్రమలో తాను కూడా భాగం కావడం అన్నది గర్వంగా ఉంటే... ఈ ప్రయాణం చాలా ఆనందాన్ని ఇస్తోందని తెలిపాడు. సినిమా పరాజయం పాలైతే కెరీర్ ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నాడు. ఒక ఫ్లాప్ వచ్చిన తరువాత సినీ పరిశ్రమకు చెందిన వారు మన కాల్స్ కూడా రిసీవ్ చేసుకోరని చెప్పాడు. పెద్ద స్టార్ కుమారుడికైనా ఇలాంటి అనుభవం తప్పదని స్పష్టం చేశాడు. సినీ పరిశ్రమలో పరాజయం అన్నది మన ఉనికిని కూడా ధ్వంసం చేస్తుందని అభిషేక్ అభిప్రాయపడ్డాడు.