: మోదీ గారు! వీటికి సమాధానాలు చెప్పండి!: లోక్ సభలో రాహుల్ నిప్పులు


ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్ సభలో నిప్పులు చెరిగారు. ఎన్డీయే హయాంలో ధరల పెరుగుదలపై ఆవేదన వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ, పలు ఆహార ధాన్యాల ధరలను, ప్రభుత్వం వసూలు చేస్తున్న ట్యాక్సులను ప్రస్తావించారు. రైతుల నుంచి ప్రభుత్వం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంత మొత్తం దోచుకుంటోందీ వివరించారు. ఈ సందర్భంగా పలు ఉదాహరణలతో రాహుల్ మాట్లాడుతూ, యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా పప్పు ధరలో మార్కెట్ రేట్ కి, రైతుల నుంచి కొనుగోలు రేటుకి మధ్య కేవలం 30 రూపాయల వ్యత్యాసం ఉండేదని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ వ్యత్యాసం 130 రూపాయలకు పెరిగిందని అన్నారు. 'ప్రధాని మోదీగారు! మీరు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది' అని రాహుల్ సూచించారు. ఆ 100 రూపాయలు ఎవరు తింటున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రదానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మాట్లాడుతూ 'నేను ప్రధానిగా ఉండాలనుకోవడం లేదని, దేశానికి సేవకుడిగా ఉండాలనుకుంటున్నా'నని ఘనంగా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. అలాంటి సేవకుడు దేశ ప్రజలకు, ప్రధానంగా రైతులకు చెందిన భూములను పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు మూడు సార్లు సవరణకు ప్రతిపాదించారని ఆయన చెప్పారు. మరి మోదీ దేశానికి సేవ చేస్తున్నారా? లేక పెట్టుబడిదారులకు సేవలు చేస్తున్నారా? అని ఆయన అడిగారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ సమస్యను తీర్చేస్తానని ఘనంగా ప్రకటించిన మోదీ...మేకిన్ ఇండియా, స్వచ్ఛభారత్, జన్ ధన్ యోజన పథకాలతో ప్రజలకు ఎంత మేలు జరిగింది?...నిరుద్యోగ సమస్య ఎంత పరిష్కారమైందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News