: ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు: బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అసమర్థతవల్లే ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీక్ అయిందని ఆరోపించారు. దీనికి సంబంధించిన నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. నిందితులు గతంలోనే పట్టుబడినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల లీకేజీ అంశంలో తెలంగాణ విద్యాశాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై నోరు విప్పాలని ఆయన డిమాండ్ చేశారు.