: ఎంసెట్-3 ఉంటుందా? ఉండదా?... నేటికి సస్పెన్స్.. రేపు తేలుస్తామన్న కేసీఆర్ సర్కారు
ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకైన కేసులో ఈ మధ్యాహ్నం తెలంగాణ ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడుతుందని ఆశించిన విద్యార్థులు మరో రోజు పాటు వేచి చూడక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. సీఐడీ నేడు లీకేజీపై నివేదిక ఇస్తే, దాన్ని పరిశీలించి పరీక్షను రద్దు చేయాలా? వద్దా? అన్న విషయాన్ని తెలియజేస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం సస్పెన్స్ ను మరో రోజు కొనసాగించనుంది. ఈ విషయంలో నివేదికను పూర్తిగా పరిశీలించి, కేసీఆర్, విద్యాశాఖ అధికారులతో మధ్యాహ్నం తరువాత చర్చిస్తామని మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. తుది నిర్ణయాన్ని రేపు ప్రకటిస్తామని అన్నారు. 70 వేల మంది విద్యార్థులకు అన్యాయం జరుగకుండా చూడాలన్నదే తమ అభిమతమని తెలిపారు. కాగా, ఏ ప్రశ్నాపత్రం లీకైనా, పరీక్షను పూర్తిగా రద్దు చేసి కొత్తగా పరీక్షలు నిర్వహించాల్సిందేనని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ఇప్పటికే రెండుసార్లు పరీక్ష రాసిన విద్యార్థినీ విద్యార్థుల్లో గుబులు పుట్టిస్తోంది. భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకే తెలంగాణ ప్రభుత్వం కట్టుబడిన పక్షంలో విద్యార్థులు మరోమారు పరీక్షకు సిద్ధపడక తప్పదు.