: 'ఆమ్ ఆద్మీ'లో ఎదగాలంటే శీలం విషయంలో సర్దుకుపోవాల్సిందే: ఆత్మహత్య చేసుకున్న మహిళా కార్యకర్త తల్లిదండ్రుల సంచలన ఆరోపణ
గత వారంలో ఆత్మహత్య చేసుకుని మరణించిన ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా కార్యకర్త తల్లిదండ్రులు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్సీడబ్ల్యూ) ముందు విచారణకు హాజరై సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో ఎదగాలంటే, శీలంపై సర్దుకుపోవాల్సిందేనని నేతలు తన బిడ్డకు స్పష్టంగా చెప్పారని యువతి తండ్రి ఎన్డీడబ్ల్యూ చైర్ పర్సన్ లలితా కుమారమంగళం ముందు స్టేట్ మెంట్ ఇచ్చారు. "నీ శరీరంపై ప్రేమను వదులుకొని సర్దుకుపోవాలి. మేం ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తేనే పార్టీలో ఎదుగుతావు" అని ఆప్ నేత తన కుమార్తెను లైంగికంగా వేధించాడని తెలిపారు. తన ఇద్దరు మనవరాళ్లను ఇప్పుడు స్కూలుకు కూడా రానివ్వడం లేదని ఆయన ఫిర్యాదు చేశారు. నేతల వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుందని అన్నారు. కాగా, ఈ కేసులో ఆప్ ఢిల్లీ అధ్యక్షుడు దిలీప్ పాండే సహా పలువురిపై ఆరోపణలను పోలీసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఓ ఆప్ నేతను అరెస్ట్ చేయగా, ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. మహిళా కార్యకర్త తల్లిదండ్రుల ఆరోపణలను ఆప్ అధికార ప్రతినిధి దీపక్ బాజ్ పేయి ఖండించారు. "ఆరోపణలు వచ్చిన వ్యక్తికి పార్టీతో సంబంధం లేదు. అతను ప్రాథమిక సభ్యుడు కాదు. కేసుతో పార్టీకి ప్రమేయం లేదు. ఢిల్లీ పోలీసులు కేసును విచారిస్తున్నారు. నిజం ఏంటో తేలుతుంది" అని అన్నారు. మృతురాలి పిల్లలను స్కూలుకు రానివ్వని విషయం తెలుసుకున్న మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ స్వయంగా కల్పించుకుని పాఠశాల యాజమాన్యానికి క్లాస్ పీకారు.