: సల్మాన్ 'జింక వేట' కేసులో 18 ఏళ్లుగా మాయమైన జిప్సీ డ్రైవర్ హరీష్ దులానీ ప్రత్యక్షం... సల్మానే జింకను కాల్చాడని అంటున్న డ్రైవర్!
దాదాపు 18 సంవత్సరాల క్రితం జోథ్ పూర్ ప్రాంతంలో 'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రం షూటింగ్ జరుగుతున్న వేళ, సల్మాన్ ఖాన్ సహా సోనాలీ బింద్రే తదితరులను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లిన జిప్సీ డ్రైవర్, కృష్ణ జింకను సల్మాన్ షూట్ చేశాడన్న కేసులో కీలక సాక్షి హరీష్ దులానీ, సుదీర్ఘ కాలం అదృశ్యం అనంతరం ప్రత్యక్షమయ్యాడు. సల్మాన్ వేట కేసులో అత్యంత ముఖ్యమైన దులానీ, కేసు విచారణ సమయం నుంచి అదృశ్యం కాగా, సరైన సాక్ష్యాలు లేవంటూ, సల్మాన్ పై కేసును రాజస్థాన్ హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. "18 సంవత్సరాల క్రితం నేను కోర్టులో ఇచ్చిన స్టేట్ మెంటుకే ఇప్పుడు కూడా కట్టుబడి వున్నా. మా కుటుంబానికి బెదిరింపులు రావడంతోనే భయంతో నేను పారిపోయా. నాకు పోలీసు రక్షణ కల్పిస్తే, ఇప్పుడైనా సాక్ష్యం చెబుతా" అని దులానీ వ్యాఖ్యానించాడు. కేసు కోర్టుకు వచ్చిన తొలినాళ్లలో, సల్మాన్ స్వయంగా జిప్సీని నడుపుతూ, తుపాకితో జింకను కాల్చాడని దులానీ కోర్టు ముందు సాక్ష్యమిచ్చిన సంగతి తెలిసిందే. ఆపై క్రాస్ ఎగ్జామిన్ కు ఎన్నడూ అందుబాటులోకి రాలేదు. దులానీ తిరిగి ప్రత్యక్షం కావడంపై రాజస్థాన్ హోం మంత్రి గులాబ్ చంద్ కటారియా స్పందిస్తూ, "ఈ వ్యక్తి ఇన్ని సంవత్సరాలుగా ఎన్నడూ తనకు భద్రత కోరలేదు. ఒకవేళ అతను రక్షణ కల్పించాలని కోరితే, సెక్యూరిటీని ఇస్తాం" అని అన్నారు. దులానీ కోర్టుకు వస్తే, సల్మాన్ కేసు కీలక మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.