: ఎంసెట్-2 రద్దు... త్వరలో ఎంసెట్-3కి నోటిఫికేషన్?
ఎంసెట్-2ను రద్దు చేసి తాజాగా ఎంసెట్-3ని నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. క్వశ్చన్ పేపర్ లీకైనట్టు సీఐడీ అధికారులు నిర్ధారించడంతో ఎంసెట్-2ను రద్దు చేయాలని, ఈ విషయాన్ని నేడు అధికారికంగా ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. సీఐడీ అధికారుల దర్యాప్తు నివేదిక ప్రభుత్వానికి అందిన వెంటనే రద్దుపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది. అదే కనుక జరిగితే దాదాపు 70 వేలమంది విద్యార్థులు ఎంసెట్-3కి హాజరుకాక తప్పదు. పేపర్ లీకేజీ నిజమేనని ఆధారాలు లభ్యం కావడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామంత్రి సి.లక్ష్మారెడ్డి బుధవారం ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి రాజశేఖరరెడ్డితో సమావేశమయ్యారు. అలాగే హెల్త్ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ కరుణాకర్రెడ్డితోనూ చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంసెట్-2 రద్దుపై గురువారం నిర్ణయం తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్తో చర్చించిన అనంతరం ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయనున్నట్టు తెలిపారు. ఆయన వ్యాఖ్యలతో ఎంసెట్-2 రద్దు తప్పదని తేలిపోయింది. ఆ పరీక్షను రద్దుచేసి ఎంసెట్-3 కోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీచేయాలని భావిస్తున్న ప్రభుత్వం మరికొన్ని గంటల్లో ఈ విషయంలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.