: ప్రతిపక్షాల ఆరోపణలు గాలి బుడగల్లా ఎగిరిపోయాయి... రైతుల త్యాగం మరువలేనిది: హరీశ్‌రావు
మల్లన్నసాగర్ నిర్మాణానికి సహకరించేందుకు పల్లెపహాడ్ వాసులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈరోజు మెదక్ జిల్లాలోని మల్లన్నసాగర్ ముంపు గ్రామం పల్లెపహాడ్ రైతులు, యువకులతో ఆయన చేసిన చర్చలు సఫలమయ్యాయి. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పల్లెపహాడ్ రైతులకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై రైతులకి నమ్మకం ఉందని, పల్లెపహాడ్ రైతుల త్యాగం వెలకట్టలేనిదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుకు సహకరిస్తామని పల్లెపహాడ్ గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ముందుకొచ్చారని, మిగతా గ్రామాలను కూడా ఒప్పించి తొందరగా ప్రాజెక్టు పనులు మొదలు పెట్టి దాన్ని పూర్తి చేసుకుందామని హరీశ్‌రావు అన్నారు. నిర్వాసితులను అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన తెలిపారు. లక్షలాది రైతుల జీవితాల్లో ప్రాజెక్టు ద్వారా వెలుగులు నింపి ఆకుపచ్చ తెలంగాణను నిర్మించుకుంటామని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి 6 గ్రామాలు ముందు కొచ్చాయని ఆయన తెలిపారు. ముంపు గ్రామాల ప్రజలకు ఎటువంటి లోటు రానివ్వకుండా చూసుకుంటామని హరీశ్‌రావు అన్నారు. ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు గాలిబుడగల్లా పేలి పోయాయని ఆయన వ్యాఖ్యానించారు. ఓ వైపు ప్రాజెక్టు, మరోవైపు నిర్వాసితులకు ఊర్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.