: మరోసారి హద్దు దాటిన చైనీస్ రెడ్ ఆర్మీ.. ఇండియాలోకి చొరబాటు
చైనీస్ రెడ్ ఆర్మీ మరోసారి దుస్సాహసానికి పాల్పడింది. చైనా బలగాలు ఉత్తరాఖండ్‌లోకి చొరబడ్డాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్‌రావత్ తాజాగా మీడియాకు తెలిపారు. ఈనెల 19న తమ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలోకి ఆ దేశ ఆర్మీ చొరబడిందని, అక్కడున్న ముఖ్యమైన కెనాల్‌ను మాత్రం చైనీస్ రెడ్ ఆర్మీ తాకే ప్రయత్నం చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్రం స్పందించాలని ఆయన అన్నారు. ఈనెల 19న చైనీస్ రెడ్ ఆర్మీ ఆ రాష్ట్రంలోకి చొరబడినట్లు ఐటీబీపీ కూడా పేర్కొంది. ఓ జాతీయ మీడియా తెలిపిన వివరాల ఆధారంగా ఐటీబీపీ దీనిపై నివేదిక ఇచ్చింది. హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు చైనా ఆర్మీ చేసిన దుస్సాహసంపై స్పందిస్తూ.. అది చొరబాటో కాదో అనే అంశం తమకు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. చైనాతో ఉత్తరాఖండ్ రాష్ట్రం 350 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటోన్న విషయం తెలిసిందే. చైనా గత కొన్నేళ్లుగా ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంది. తాజాగా మరోసారి ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది.