: అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్రయాణిస్తున్న 'ఎయిర్ ఇండియా వన్' కుప్పకూలి ఉండేది... టైమ్స్ లో సంచలన కథనం


భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్న వేళ, రష్యాలో అధికారిక పర్యటనకు ఆయన్ను తీసుకు వెళ్లిన 'ఎయిర్ ఇండియా వన్' విమానం కుప్పకూలి ఉండేదని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ ఘటన నవంబర్ 11, 2007న జరిగినట్టు తెలిపింది. బోయింగ్ 747 రకానికి చెందిన విమానంలో మాస్కో ఎయిర్ పోర్టుకు మన్మోహన్ చేరుకున్న వేళ, తృటిలో అత్యంత ఘోర ప్రమాదం తప్పిందని వెల్లడించింది. ఎయిర్ ఇండియా వన్ విమానం రన్ వేకు సమీపించిన సమయంలో, ల్యాండింగ్ గేరు సరిగ్గా తెరచుకోలేదని, దీన్ని గమనించిన మాస్కో ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) వెంటనే పైలట్ కు సమాచారం ఇచ్చి, వార్నింగ్ లైట్లు వెలిగించారని ఫ్లయిట్ డేటా రికార్డర్ (ఎఫ్టీఆర్)లో ఉందని టైమ్స్ పేర్కొంది. ఆపై పైలట్లు మరోసారి ప్రయత్నించి ల్యాండింగ్ గేరు సరిగ్గా వేసి విమానాన్ని దించారని, ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా, ల్యాండవుతూనే విమానం పేలి ఉండేదని తెలిపింది. కాగా, ప్రధాని ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్ గేరు సరిగ్గా తెరచుకోని సందర్భం ఒకటి ఉందని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఓ పైలట్ కూడా తెలిపారు. ఎయిర్ ఇండియా మాత్రం ఈ విషయమై ఎలాంటి స్పందననూ వెలిబుచ్చలేదు.

  • Loading...

More Telugu News