: అబ్దుల్ కలాంకు తీరని కోరిక ఇది!
భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ దివంగత అబ్దుల్ కలామ్ తొలి వర్ధంతి ఈరోజు. ఈ సందర్భంగా కలాంకు అత్యంత సన్నిహితుడు అయిన శ్రీజన్ పాల్ సింగ్ ఆయనకు నివాళిగా ‘వాట్ కెన్ ఐ గివ్ ?: లైఫ్ లెస్సన్స్ ఫ్రమ్ మై టీచర్ ఏపీజే’ పేరిట ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకంలో కలాం తీరని కోరిక గురించి ఆయన ప్రస్తావించారు. అన్నయ్య ఏపీజే మరకేయర్ అంటే కలాం కు ఎంతో ఇష్టమని, 2016 నవంబరులో మరకేయర్ తన వందో సంవత్సరంలోకి అడుగుపెడతారని, ఆ వేడుకను చాలా ప్రత్యేకంగా నిర్వహించాలనే విషయాన్ని కలాం తనతో చెప్పినట్లు ఆ పుస్తకంలో ఆయన రాశారు. స్వస్థలం రామేశ్వరంలో కుటుంబసభ్యులందరితో కలిసి ఈ వేడుక నిర్వహించాలనుకున్నారని, ఆ ఊరంతా 100 నంబరుతో బ్యానర్లు కట్టాలని, సంగీత కచేరీలు నిర్వహించాలని కలాం అనుకున్నారట. అలాగే, దేశ వ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో 100 లైబ్రరీలను కూడా ఏర్పాటు చేయాలని కలాం ప్లాన్ చేశారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. తన సోదరుడికి వందేళ్లు పూర్తయ్యే విషయాన్ని శాస్త్రవేత్త అయిన కలాం తనదైన శైలిలో చెప్పారట. ‘తన అన్న సూర్యుడి చుట్టూ వందసార్లు తిరిగాడని’ కలాం తనతో అన్న విషయాన్ని శ్రీజన్ పాల్ పుస్తకంలో ప్రస్తావించారు.