: టాల్గో ట్రయల్ రన్... ముంబై-ఢిల్లీ మధ్య పరుగులు పెట్టనున్న హైస్పీడ్ రైలు


స్పానిష్ తయారీ హైస్పీడు రైలు టాల్గో కనుక పట్టాలెక్కితే ముంబై నుంచి ఢిల్లీకి ఇక 13 గంటల్లోనే చేరుకోవచ్చు. ఇప్పటికే పలుమార్లు ఈ రైలుకు ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు ఆగస్టులో తుది ట్రయల్ రన్ నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఆగస్టు 1 నుంచి ఐదో తేదీ వరకు ముంబై-ఢిల్లీ మధ్య మూడుసార్లు ట్రయల్ రన్స్ నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. న్యూఢిల్లీలో ఆగస్టు 1న సాయంత్రం 7.55 గంటలకు బయలుదేరే టాల్గో 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని వెస్ట్రన్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ వేగంతో ప్రయాణించే రైలు ఢిల్లీ, ముంబై మధ్య ఉన్న 1,384 కిలోమీటర్ల దూరాన్ని 14 గంటల్లో చేరుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణిస్తున్న రాజధాని రైలుకు ఈ దూరాన్ని చేరుకునేందుకు 16 గంటలు పడుతోంది. ఆగస్టు 3న ముంబైలో తెల్లవారుజామున మూడు గంటలకు టాల్గో బయలుదేరుతుంది. అదే రోజు సాయంత్రం ఢిల్లీ చేరుకోవాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఆగస్టు 5న నిర్వహించే మూడో ట్రయల్ రన్‌లో భాగంగా 150 కిలోమీటర్ల వేగంతో రైలును నడుపుతారు. ఈ వేగంతో 12:55 గంటల్లోనే ఢిల్లీ నుంచి ముంబై చేరుకుంటుందని అధికారులు వివరించారు. ట్రయల్ రన్స్ అనంతరం వీలైనంత తొందరగా ఈ రైలును పట్టాలెక్కించాలని అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News