: ప్రకాశం జిల్లాలో ప్రైవేటు ట్రావెల్ బస్సు, లారీ ఢీ.. క్షణాల్లోనే కాలిబూడిదైన బస్సు... ప్రయాణికులకు గాయాలు!
ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం వీరేపల్లి వద్ద ఈ తెల్లవారుజామున ఆరు గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మియాపూర్ నుంచి చెన్నై వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్ బస్సు.. లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు అద్దాలు పగలగొట్టి బయటపడ్డారు. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులకు గాయాలైనట్టు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం తర్వాత మంటలు చెలరేగడంతో క్షణాల్లోనే బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. ప్రమాదంలో క్లీనర్‌కు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్ష సాక్షలు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.