: ఈ బిల్లు మనీ బిల్లు... ఏపీకి ప్రత్యేకహోదా బిల్లుపై తేల్చే అధికారం రాజ్యసభకు లేదు: అరుణ్ జైట్లీ
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా బిల్లు ద్రవ్య బిల్లు అని, దీనిని లోక్ సభలో ప్రవేశపెట్టాలి తప్ప రాజ్యసభకు చర్చించే అధికారం లేదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఇది రాజ్యాంగంలో ఉందని... ఏపీకి ప్రత్యేకహోదా బిల్లు ద్రవ్యబిల్లు అని ఆయన స్పష్టం చేశారు. దీంతో ద్రవ్య బిల్లుపై చర్చించేందుకు రాజ్యసభకు అధికారం లేదని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ తెలిపారు. దీనిపై కమ్యూనిస్టు ఎంపీ సీతారాం ఏచూరీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అరుణ్ జైట్లీ సభను తప్పుదోవపట్టిస్తున్నారని, ప్రైవేట్ మెంబర్ బిల్లును మనీ బిల్లుగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకహోదా బిల్లు ఆయన చెబుతున్నట్టు ద్రవ్యబిల్లు అయితే డిప్యూటీ ఛైర్మన్ బిల్లును ఎందుకు స్వీకరించారని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కురియన్ అది ద్రవ్యబిల్లా? కాదా? అన్నది గౌరవనీయ స్పీకర్ నిర్ణయిస్తారని అన్నారు. ఈ రోజు ఈ బిల్లుపై చర్చకు అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు.