: ఇండియాకు రూ. 6,700 కోట్ల జరిమానా విధించిన ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్


బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న దేవాస్ మల్టీ మీడియాతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అనుబంధ సంస్థ ఆంథ్రిక్స్ కుదుర్చుకున్న డీల్ ను 2011లో రద్దు చేసుకున్నందుకు ఇప్పుడు భారత సర్కారు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. ఈ డీల్ రద్దుపై తమకు అన్యాయం జరిగిందని దేవాస్ అంతర్జాతీయ ట్రైబ్యునల్ ను ఆశ్రయించడంతో విచారణ జరిపిన న్యాయస్థానం బిలియన్ డాలర్లను (సుమారు రూ. 6,700 కోట్లు) జరిమానాగా చెల్లించాలని తీర్పిచ్చింది. ఈ డీల్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే... రెండు కొత్త శాటిలైట్లతో ఎస్-బ్యాండ్ స్పెక్ట్రమ్ ద్వారా బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు ఇవ్వాలని భావించిన దేవాస్, శాటిలైట్ల తయారీ కాంట్రాక్టును ఇస్రో నేతృత్వంలోని ఆంథ్రిక్స్ కు అప్పగించింది. 12 ఏళ్ల పాటు ఎస్-బ్యాండ్ తరంగాలను వాడేందుకు రూ. 578 కోట్లను కూడా కట్టింది. ఈ డీల్ 2005లో కుదరగా, ఆపై వెలుగులోకి వచ్చిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం నేపథ్యంలో 2011లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. ముందు కుదుర్చుకున్న డీల్ ను రద్దు చేయడం వల్ల తమకు తీరని అన్యాయం జరిగిందని, ఇన్వెస్టర్లంతా నష్టపోయారని దేవాస్ మల్టీ మీడియా కోర్టుకు ఎక్కింది. కాగా, ఇస్రో మాజీ ఉద్యోగులను విధుల్లోకి తీసుకున్న దేవాస్, తీర్పు తనకు అనుకూలంగా వచ్చేందుకు వారిని వాడుకున్నట్టు అనుమానాలు ఉన్నాయి. అప్పట్లో ఈ డీల్ పై ఇస్రో తరఫున సంతకం చేసిన మాధవన్ నాయర్ తీర్పుపై స్పందిస్తూ, నాడు చేసిన పని ఓ అనాలోచిత చర్యగా అభివర్ణించడం గమనార్హం.

  • Loading...

More Telugu News